News Hunter : తెలంగాణలో ఎన్నికల వేళ ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'నా ఓటు' పేరిట రూపొందించిన ఈ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరు, పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గం, సౌకర్యాల వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ యాప్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంయుక్త అధికారి ఆమ్రపాలి మాట్లాడుతూ యాప్ విశేషాలను వివరించారు. దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఉచిత రవాణా కూడా ఈ యాప్ ద్వారా కల్పించే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, అధికారుల వివరాలను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. 'నా ఓటు' యాప్ లోగో కోసం పోటీలు నిర్వహిస్తున్నామని, తెలుగు, ఆంగ్లం, హిందీలో లోగోలు రూపొందించి తమకు పంపవచ్చని తెలిపారు. ఎంపికైన లోగో రూపకర్తలకు రూ.15వేలు బహుమతిగా ఇస్తామని ఆమ్రపాలి ప్రకటించారు.

0 Comments