News Hunter: చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మనదేశంలో నాణ్యమైన ఫోన్లను అందుబాటు ధరలకే విక్రయిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు షామి మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా ఆఫ్‌లైన్ అమ్మకాలపై షామి దృష్టి సారించింది. గత నెలలో తొలిసారిగా షామి బెంగుళూరులో తన మి స్టోర్‌ను ప్రారంభించింది. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలలో మి స్టోర్‌లను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఇందులో భాగంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఒకే రోజున రికార్డు స్థాయిలో 500 రిటైల్ స్టోర్లను మి ప్రారంభించింది. మి స్టోర్లలో షామి ఉత్పత్తులు వినియోగదారులకు లభిస్తాయి.
ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మకాలను పెంచుకుని వినియోగదారులకు మరింత దగ్గర కావాలని షామి వ్యూహంగా ఉంది. రెడ్‌మి 5ఎ, రెడ్‌మి నోట్ 5ప్రో, రెడ్‌మి 6, రెడ్‌మి 6ఎ, రెడ్‌మి 6ప్రో ఉత్పత్తులతో వినియోగదారులకు బాగా చేరువయ్యింది. 8 సంవత్సరాల క్రితం దేశంలోకి అడుగు పెట్టిన షామి మొబైల్ ఫోన్లతో పాటు లగేజి, షూ, గృహోపకరణాలు, ఇతర ఉత్ప త్తులను అమ్మకం చేస్తున్నది. దేశంలో షామి అమ్మకాలు 49శాతం పెరిగాయి. 2019 చివరి నాటికి దేశవ్యాప్తంగా 5 వేల మి స్టోర్లను ప్రారంభించాలని షామి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టోర్ల ఏర్పాటుద్వారా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని షామి అంచనాగా ఉంది. ఈ ఏడాది చివరిలోపు మరో 100 స్టోర్లను నెలకొల్పాలని ఏర్పాటు చేస్తున్నది.

0 Comments