News Hunter : ఐదేళ్ల చిన్నారి పేరు చూసి విచిత్రంగా ఉందంటూ ఎగతాళి చేశారు ఓ ఎయిర్‌లైన్ సిబ్బంది. అంతేగాక.. చిన్నారి బోర్డింగ్ పాస్‌ను ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై చిన్నారి తల్లి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు విమానయాన సంస్థ క్షమాపణలు తెలిపింది. అమెరికాలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..
టెక్సాస్‌కు చెందిన ట్రాకీ రెడ్‌ఫోర్డ్ తన ఐదేళ్ల కుమార్తెతో కలిసి ఇటీవల ఎల్ పాసో వెళ్లేందుకు కాలిఫోర్నియాలోని జాన్ వేనీ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ట్రాకీ కుమార్తె పేరు అబ్సీడీ. కానీ స్పెల్లింగ్ మాత్రం abcde అని ఉంది. చెకింగ్ వద్ద బోర్డింగ్ పాస్‌లో చిన్నారి పేరు చూసిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్ సిబ్బంది అవమానకరంగా ప్రవర్తించారు. ఇతర సిబ్బందికి ఆమె పేరు చూపిస్తూ నవ్వుతూ గేళి చేశారు. అక్కడితో ఆగకుండా చిన్నారి బోర్డింగ్ పాస్‌ను ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రాకీ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.
'నిజానికి ఆ రోజు వారు ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారన్న విషయం నాకు తెలియదు. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ పోస్టును ఫేస్‌బుక్‌లో చూసిన నా స్నేహితులు కొందరు నాకు చెప్పారు. దీంతో నేను సౌత్‌వెస్ట్‌కు ఫిర్యాదు చేశాను. అయితే వారు దీని గురించి పట్టించుకోలేదు' అని ట్రాకీ ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పేరు కొత్తగా ఉన్నంత మాత్రానా అవమానకరంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కాస్తా స్థానిక మీడియాలో వైరల్ కావడంతో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్ స్పందించి క్షమాపణలు తెలిపింది. ప్రయాణికుల గౌరవానికి భంగం కలిగించేలా తాము ఎన్నటికీ ప్రవర్తించబోమని, ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది.

0 Comments