News Hunter : తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, తెదేపా, తెరాసలకు అవకాశం ఇచ్చారని, ఈ ఒక్కసారి భాజపాకు అవకాశం ఇచ్చి చూడాలని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రజలను కోరారు. తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దేశంలోనే మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు.
''నిర్మల్ పరిశ్రమలకు అవకాశం ఉన్న ప్రాంతం. ఒకప్పుడు ఇక్కడ అనేక రకాల పరిశ్రమలు నడిచేవి. ఇప్పుడు ఎందుకు నడవడం లేదు? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్, తెదేపా, తెరాసకు ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా లేదు. ఆ సత్తా భాజపాకు మాత్రమే ఉంది. మజ్లిస్‌కు భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచన దినం పాటించడం లేదు. రజాకార్లను, నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ విమోచన దినాన్ని పాటించే సత్తా భాజపాకు తప్ప ఎవరికీ లేదు. ఇదే భూమిపై అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ దేవతలను అవమానించారు. ఆయనపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ కేసీఆర్ నెరవేర్చలేదు? ఈసారైనా నెరవేరుస్తారా'' అని అమిత్‌షా ప్రశ్నించారు.
''ప్రతి ఇంటికీ గోదావరి నీటిని తీసుకొస్తానని చెప్పిన కేసీఆర్ ఆ పనిచేయలేకపోయారు. తెలంగాణకు వచ్చిన ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ చెప్పారు. ఐదేళ్లు అయినా వాటిని భర్తీ చేయలేదు. నాలుగేళ్లలో 4,500 మంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నారు. కొండగట్టు దుర్ఘటనలో 65 మంది చనిపోతే వెళ్లడానికి కేసీఆర్‌కు సమయం లేదు. ఒవైసీ సోదరులతో బిర్యానీ తినడానికి మాత్రం సమయం ఉంటుందా? దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అవసరమా? అన్ని పార్టీలు కలిసినా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నంత వరకు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదు. రాహుల్ కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. అన్ని పార్టీలతో కలుస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇలానే ఎన్నికలకు వెళ్లారు. అయినా అన్ని రాష్ట్రాల్లో ఓటమి పాలయ్యారు. రోజురోజుకూ ఆ పార్టీ కనుమరుగవుతోంది'' అని అమిత్‌షా అన్నారు.

0 Comments