ADS

header ads

రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే నా ఆశయం

రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తన ఆశయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తుని ఘటన రాష్ట్ర చరిత్రలో బాధ కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు విజయవాడ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో తుని చేరుకున్న ఆయన తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని గొల్ల అప్పారావు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. విధ్వంసాలు జరగకుండా ఆపేందుకే వచ్చామని, నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తామని చెప్పారు. స్వార్థాన్ని పక్కన పెట్టి రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసమే తెదేపాతో కలిసి పనిచేశామన్నారు. భాజపాను వెనకేసుకొస్తున్నానని సీఎం చంద్రబాబు అంటున్నారని.. సొంత అన్నయ్యనే కాదని బయటకు వచ్చిన తనకు ప్రధాని మోదీ ఎంత? అని వ్యాఖ్యానించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు భయపడతానా? అని అన్నారు. తనకు రూ.వేల కోట్ల ఆస్తులు, కాంట్రాక్టులు, దోపిడీచేసే చరిత్ర లేవన్నారు. అందువల్ల ఎవరైనా తనను ఎందుకు బెదిరిస్తారని అన్నారు.
తునిలో ఒక్క పారిశ్రామికవాడ కూడా లేదని, ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నారన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. మీకు ఏదైనా చేయమంటారా? అని సీఎం చంద్రబాబు తనను చాలా సార్లు అడిగారని.. రాష్ట్రానికి మంచి పాలన, యువతకు ఉద్యోగాలు కల్పించాలని తాను కోరినట్లు పవన్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఎన్నికల్లో ఇతర పార్టీల వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని, ఓటు మాత్రం జనసేనకు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments