ADS

header ads

బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి.. 24 గంటల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు

News Hunter :  నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవలే పెథాయ్‌ తుపాన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వణికించిన నేపథ్యంలో... వరి కోతల సమయంలో గాలులు, వర్షాలు విరుచుకుపడడంతో అన్నదాతకు తీవ్రనష్టం వాటిల్లింది. రెండు రోజుల నుంచి ఎండ కాస్తుండడంతో రైతులు కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు.. అల్పపీడన ద్రోణి కారణంగా తమిళనాడును ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ప్రాంతానికి చలిగాలుల తీవ్రత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. కోస్తాంధ్రలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి. రానున్న రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాదిలో చలి తీవ్రత పెరగడం, అటు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం కూడా కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉండడానికి కారణమని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో శని, ఆదివారం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.