ADS

header ads

ఏడాది పాటు స్మార్ట్‌ఫోన్ వాడకుంటే రూ.72 లక్షలు మీవే...

News Hunter : స్మార్ట్ ఫోన్ ఉపయోగించకుండా మీరు ఒక్క రోజు ఉండగలరా? కనీసం గంట సేపు పక్కన పెట్టగలరా!? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మన జీవితంలో భాగంగా మారిపోయింది. అయితే మీరు ఏడాది పాటు మీ స్మార్ట్ ఫోన్‌ను పక్కన పెట్టేస్తే భారీ నజరానా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. రూ.72 లక్షల మొత్తం దక్కించుకోవచ్చు!

ప్రస్తుతం అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్! తినే సమయంలో, పడుకునే సమయంలో ఇలా అన్నింటా స్మార్ట్ ఫోన్ లేని జీవితం ఊహించని విధంగా మారిపోయింది. ఓ విధంగా దానికి మనిషి బానిస అయ్యాడు! కానీ 365 రోజుల పాటు మీరు ఈ ఫోన్‌కు దూరంగా ఉంటే బంపర్ ఆఫర్ గెలుచుకోవచ్చు. చాలా ఆసక్తికరంగా ఉన్న దీని వివరాల్లోకి వెళ్దాం.



ఎప్పటి నుంచి, దరఖాస్తు ఎలా?

కోకాకొలా కంపెనీకి చెందిన విటమిన్ వాటర్ ఈ ఆఫర్ ప్రకటించింది. ఇది అమెరికాకు చెందిన కంపెనీ. స్క్రోల్ ఫర్ ఫ్రీ ఫర్ ఏ ఇయర్ పరుతో ఈ పోటీని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేవారు ఏడాది పాటు స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. వచ్చే ఏడాది (2019) జనవరి 8వ తేదీ ఎంట్రీకి చివరి తేది. విటమిన్ వాటర్ సంస్థకు చెందిన అధికారిక ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇలా ఎంపిక చేస్తారు


స్మార్ట్ ఫోన్‌ లేకుండా ఏడాది సమయాన్ని ఎలా గడపుతామనే విషయాన్ని #NoPhoneforaYear, #contest హ్యాష్‌ట్యాగ్‌లతో పంపించాలి. పోటీదారుడు ఇచ్చే సమధానంపై కంపెనీ సంతృప్తి చెందవలసి ఉంటుంది. అప్పుడు వారిని ఎంపిక చేస్తారు. జనవరి 22వ తేదీలోపు సెలక్ట్ చేస్తారు. అనంతరం కాంట్రాక్టు పత్రాలపై సంతకం చేయిస్తారు.


ఇవి ఉపయోగించొద్దు.. ఇవి ఉపయోగించవచ్చు

పోటీదారులు కేవలం స్మార్ట్ ఫోన్‌కు మాత్రమే దూరంగా ఉండాలి. కంప్యూటర్లను యథాతథంగా ఉపయోగించవచ్చు. వాయిస్ యాక్టివేటెడ్ డివైజ్‌లు అయిన గూగుల్ హోం, అమెజాన్ ఎకో వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కానీ, ట్యాబ్లెట్స్‌ను మాత్రం ఉపయోగించవద్దు. ఇతరుల వాటిని కూడా ఉపయోగించవద్దు.


ఆరు నెలలైనా ఓకే... చీట్ చేయాలనుకుంటే

ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండలేం.. కానీ ఆరు నెలలు అయితే ఉండగలమని మీరు భావిస్తున్నారా? అలా కూడా పోటీలో పాల్గొనవచ్చు. కానీ అప్పుడు గెలిస్తే రూ.7.2 లక్షలు వస్తాయి. ఏడాది పాటు అయితే రూ.72 లక్షలు వస్తాయి. ఇక్కడ మరో విషయం గుర్తించండి.. మేం స్మార్ట్ ఫోన్ వాడితే వారికి తెలుస్తుందా.. అని అనుకునేరు. చీట్ చేయాలని అనుకోవద్దు. లై డిటెక్టర్ ద్వారా పరీక్షలు జరిపే అవకాశముంది.


1996 నాటి ఫీచర్ ఫోన్ ఇస్తుంది

ఇంట్లో వాళ్లు, స్నేహితులు, ఇతరులతో మాట్లాడుకునేందుకు 1996 నాటి ఫీచర్ ఫోన్‌ను ఈ సంస్థ ఇవ్వనుంది. ఇందులో ఇంటర్నెట్ వాడుకునే వెసులుబాటు ఉండదు. కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే ఉంటాయి. క్రియేటివిటీ, ఒరిజినాలిటీ, హ్యూమర్ ఈ అంశాలపై ఆధారపడి దరఖాస్తులు స్వీకరిస్తామని చెబుతున్నారు.