ADS

header ads

వ్యాన్ కొట్టేసి.. పోలీసుల్నే సాయమడిగి..దొరికి పోయాడు..?

News Hunter : పోలీస్ సారూ వ్యాన్ ఆగిపోయింది  కాస్త తోయరూ.. అంటూ తాను దొంగిలించిన వ్యాన్ ఆగిపోతే పక్కనే డ్యూటీ చేస్తున్న ట్రాపిక్ పోలీస్‌ని రమ్మని పిలిచాడు. ఆయనతో పాటు మరో నలుగురు వచ్చి వ్యాన్‌ని తోస్తున్నారు. ఆ నలుగురిలో ఓ వ్యక్తికి ఎందుకో అనుమానం వచ్చింది. ఇది నిజంగా నీదేనా అని అడిగాడు. దొంగతనంలో ఆరితేరాడు కానీ అబద్దం చెప్పడంలో తడబడ్డాడు. అడ్డంగా దొరికిపోయాడు. పద పోలీస్ స్టేషన్‌కి మక్కెలిరగ్గొట్టి బొక్కలో తోస్తామన్నారు పోలీసులు.

అయ్యో.. ఇదెక్కడి కర్మ పొయ్యి పొయ్యి పోలీసుళ్లనే సాయమడిగానా అని తన చెప్పుతో తనే కొట్టుకున్నంత పని చేశాడు తమిళనాడు పేరిపాల్యానికి చెందిన బాలాజీ. బుధవారం రాత్రి టీఎన్ 25 ఏఎక్స్ 0866 నెంబరు గల తన టాటా ఏస్ వాహనాన్ని ఇంటికి దగ్గరలో నిలిపి ఉంచాడు వెల్లూరు జిల్లా సత్తువాచేరికి చెందిన రెహమాన్. ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్న తరువాత ఎంచక్కా వ్యాన్ తీసుకుని వెళ్లిపోయాడు దొంగతనంలో ఆరి తేరిన బాలాజీ. వ్యాన్‌తో సహా చెన్నై శివారులోని పుళల్‌కు చేరుకున్నాడు.అక్కడకు చేరుకోగానే వాహనం మొరాయించడంతో నిలిపివేసి, తనకు సాయం చేయమంటూ కేకలు వేశాడు. దీంతో అక్కడ రాత్రిపూట విధులు నిర్వహిస్తోన్న పోలీసులు సెల్వమాణిక్యం, మదన్ కుమార్‌ల‌తో పాటు మరో ఇద్దరు అక్కడకు చేరుకున్నారు. వాహనం ఆగిపోయిందని, స్టార్ట్ చేయడానికి నెట్టాల్సిందిగా బాలాజీ వారిని అభ్యర్థించాడు. పోలీసులో ఒకరికి వ్యాన్‌కి తాళం చెవి లేకపోవడంతో ఇది దొంగిలించిన వాహనమేమోనని అనుమానం వచ్చింది.

వారి అనుమానానికి ఊతమిచ్చేలా వ్యాన్ అద్దం కూడా పగిలిపోయి ఉంది. దాంతో  బాలాజీని అదుపులోకి తీసుకుని, అద్దం ఎందుకు పగిలిపోయింది, తాళం చెవి ఏదని నిలదీశారు. వ్యాన్ డోర్ తెరిచే సమయంలో అద్దం పగిలి పోయిందని తడబడ్డాడు.  తాళం చెవి కూడా ఇక్కడే ఎక్కడో పడి ఉంటుందని వెదకడం ప్రారంభించాడు. అతడి మాటలకి, చేతలకి పొంతన లేకపోవడంతో వ్యాన్ వెనక రాసి ఉన్న మొబైల్ నెంబరుకు పోలీసులు ఫోన్ చేశారు. అటు పక్క వ్యాన్ ఓనర్ ఫోన్ లిప్ట్ చేసి వ్యాన్ పోయింది ఈ నెంబరు మీకెలా తెలిసింది అంటూ పోలీసులతో మాట్లాడేసరికి బాలాజీ దొంగ అని నిర్ధారించుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటి వరకు బాలాజీ పది వాహనాలను దొంగిలించినట్టు తెలుసుకున్నారు.వాటికి నకిలీ పత్రాలు సృష్టించి ఓ మెకానిక్ ద్వారా ఈ దొంగిలించిన వాహనాలన్నీ అమ్మేసేవాడని తెలుసుకున్నారు.  అతడిపై ఓ హత్యాయత్నం కేసు కూడా నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. సీసీటీవీ ఫుటేజ్‌లో వాహనం దొంగతనం చేసిన విషయం మరో సారి నిర్ధారించుకుని వాహనదారుడికి దాన్ని అప్పగించి బాలాజీని కటకటాల వెనక్కు పంపించారు పోలీసులు.

Post a Comment

0 Comments