News Hunter : పొలం వద్ద పనులు చేస్తున్న ఓ మహిళను నీళ్లు కావాలని అడిగిన దుండగుడు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారైన సంఘటన శంషాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఠాణా పోలీసులు, బాధితుల కథనం మేరకు.. శంషాబాద్ పరిధిలోని గండిగూడకు చెందిన కంచెమీది నరేశ్ భార్య మౌనిక(21) ఆదివారం తమ పొలం వద్ద పనులు చేస్తుంది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి.. తన బైక్‌ను కొద్దిదూరంలో నిలిపి.. ఖాళీ నీళ్ల సీసాతో వెళ్లి మౌనికను నీళ్లు కావాలని అడిగాడు. బోరు వద్ద నీళ్లు పట్టుకోవాలని చెబుతుండగానే ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. తేరుకున్న మౌనిక వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు దొంగ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకున్నారు.
