ADS

header ads

విద్యార్థులను నగ్నంగా నిలబెట్టిన టీచర్లు!

News Hunter : చిత్తూరుజిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్లు రెచ్చిపోయారు. విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించారు.పాఠశాలకు హోమ్ వర్క్ చేయకుండా వచ్చారన్న కారణంతో కొందరు విద్యార్థులను నడిరోడ్డుపై ఎండలో నగ్నంగా నిలబెట్టిందో విద్యాసంస్థ. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు చైతన్య భారతి స్కూలులో జరిగింది. ఐదుగురు విద్యార్థుల బట్టలను ఊడదీయించిన టీచర్లు, తోటి విద్యార్థులు అందరూ చూసేలా స్కూలు బయట నిలబెట్టారు. బాధితులంతా 10ఏళ్లలోపు వారేకాగా.. నాలుగు రోజుల తర్వాత ఈ దుర్మార్గం బయటపడింది. స్కూల్లో టీచర్లు తమను నగ్నం నిలబెట్టడంతో చిన్నారులు అవమానంగా భావించారు.

నాలుగు రోజులు వారిలో వారే కుమిలిపోయారు. ఆ మనోవేదనను భరించలేక చివరికి తల్లిదండ్రులకు చెప్పారు. ఘటనపై వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, విద్యాశాఖ స్పందించింది. పాఠశాల కరస్పాండెంట్‌ నాగరాజ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఈవో, ఆర్‌జేడీ ఆదేశాలతో స్కూల్ గుర్తింపును అధికారులు రద్దు చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల నుంచి వివరాలు సేకరించామని.. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారికి నివేదికను అందజేస్తామని ఎంఈవో తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ తెలిపింది.