News Hunter : కొత్త ఏడాది రోజు మహారాష్ట్రలోని ముంబైతోపాటు ఇతర ప్రధాన నగరాల్లోని అన్ని హోటళ్లు, వినోద కేంద్రాలను 24 గంటల పాటు తెరిచేలా అనుమతించాలని శివసేన యూత్ వింగ్ చీఫ్ ఆదిత్య థాకరే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ యువసేన అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. ముంబై, థానె, నవీ ముంబై, పుణెతోపాటు ఇతర నగరాల్లో అన్ని చట్టపరమైన వినోద కార్యక్రమాలు, సంబరాలను 24 గంటలపాటు అనుమతించాలి అని ఆయన లేఖలో కోరారు.
ఇది మరింత ఉపాధి, ఆదాయాన్ని సమకూరుస్తుందని ఆదిత్య అభిప్రాయపడ్డారు. పగలు చట్టపరమైన పనులు రాత్రిపూట చట్ట విరుద్ధం కాదు అని కూడా ఆయన అనడం గమనార్హం. మన పౌరులపై విశ్వాసం ఉంచి.. వాళ్లు కాస్త సేద దీరడానికి అవకాశం కల్పించాలని ఆదిత్య లేఖలో కోరారు. 2013లో ఇలాగే బృహన్ ముంబై కార్పొరేషన్ నగరంలోని నివాసేతర ప్రదేశాల్లోని హోటళ్లు, దుకాణాలను 24 గంటలపాటు తెరుచుకోవడానికి వీలు కల్పించిన తీర్మానాన్ని గుర్తు చేశారు. మీ అనుమతి కోసం ముంబై వేచి చూస్తున్నది అని ఆదిత్య అన్నారు.
