News Hunter :దేశవ్యాప్తంగాక్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిల్లో అర్ధరాత్రి నుండి ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. క్రిస్టియన్ సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు విద్యుత్ కాంతులతో చర్చిలు, క్రిస్మస్ ట్రీలు ధగధగలాడుతున్నాయి. ఎటు చూసినా అందమైన బొమ్మలు సందడి చేస్తున్నాయి.
ముస్తాబైన మెదక్ చర్చ్
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చర్చిలన్నీ ఘనంగా ముస్తాబయ్యాయి. ఆసియాలో రెండో అతిపెద్దదైన మెదక్ సీఎస్‌ఐ చర్చిను క్రిస్మస్ పండుగ కోసం సుందరంగా అలంకరించారు. చర్చిలో బిషప్ రేవరెండ్ సల్మాన్ రాజ్ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించి సందేశాన్ని ఇచ్చారు.
ప్రార్థనకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే భద్రతపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు.
కొత్తకొత్త ఆవిష్కరణలతో...
క్రిస్మస్ పండుగ సందర్భంగా కొందరు కొత్తకొత్త ఆవిష్కరణలతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో సూక్ష్మకళాకారిణి వందన బియ్యపు గింజలతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బియ్యపు గింజలతో శాంటాక్లాజ్ బొమ్మ చిత్రీకరించారు. అలాగే మెర్రీ క్రిస్మస్ అంటూ బియ్యపు గింజలపై లిఖించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
భారీ కేక్... వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాలో స్థానం
క్రిస్మస్ సందర్భంగా భారీ కేక్ వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ షాపింగ్ మాల్‌లో 750కిలోల ప్లమ్ కేక్ కట్ చేసి రికార్డు సృష్టించారు. గుజరాత్‌కు చెందిన చెఫ్ ఆనంద్ కొటాక్ బృందం దీన్ని తయారు చేసింది. కేక్‌పై శాంటాక్లజ్ బొమ్మను, రకరకాల డిజైన్లు, మెర్రీ క్రిస్మస్ అని రాసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీన్ని తయారు చేయడానికి నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు.
