ADS

header ads

పది పాసవ్వని వాళ్లూ పైలెట్లే..

News Hunter : మన దగ్గర లారీ నడపాలంటే కూడా కనీసం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాంటిది పాకిస్థాన్‌లో పదో తరగతి కూడా పాస్ కాని వారు ఏకంగా విమానాలు నడిపేస్తున్నారట. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. సాక్షాత్తూ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆ దేశ సుప్రీంకోర్టు ముందు చెప్పిన మాట. పాకిస్థాన్ ప్రభుత్వ ఆధీనంలో నడిచే పీఐఏలో పనిచేస్తున్న వారి విద్యార్హతలు అన్నీ తెలుసుకోవాలంటూ ఇటీవల పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అందరి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని యూనివర్సిటీల వారు తమకు సహకరించడం లేదంటూ కోర్టుకు విన్నవించారు. అదే సమయంలో ఏడుగురు దొంగ సర్టిఫికెట్లు పెట్టినట్టు తేల్చారు. ఆ దొంగ సర్టిఫికెట్లు పెట్టిన వారిలో ఐదుగురు కనీసం పదో తరగతి కూడా పాస్ కాకపోవడం మరీ విచిత్రం.

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో మొత్తం 4321 మంది పనిచేస్తుండగా, అందులో చాలా మంది సర్టిఫికెట్ల వివరాలను సేకరించి వాటిని ధ్రువీకరిస్తున్నారు. అందులో ఓ 50 మంది తమ సర్టిఫికెట్లను ఇవ్వకపోవడంతో వారిని సస్పెండ్ చేశారు. ఇంకా 402 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంది. అందులో ఇంకా పదో తరగతి కూడా పాస్ కాని వారు ఎంతమంది ఉంటారో అనే సందేహాలు కూడా లేకపోలేదు.

పీఐఏ, సివిల్ ఏవియేషన్ ఇచ్చిన లెక్కలు చూసి సుప్రీంకోర్టుకు మైండ్ బ్లాంక్ అయింది. దీంతో సంస్థలో పనిచేస్తున్న మొత్తం 498 మంది పైలెట్ల లైసెన్స్‌లను పరిశీలించి తమకు నివేదించాలని ఆదేశించింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సుమారు రూ.36,000 కోట్ల అప్పుల్లో ఉంది. అప్పుల నుంచి బయటపడేయడానికి గత నెలలో పాక్ ప్రభుత్వం రూ.1700 కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చింది.