News Hunter : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మోతెక్కిన తెలంగాణ రోడ్లు సైలెంట్ అయ్యాయి. ఇప్పటి వరకు హోరెత్తిన వీథులన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. ఇక మిగిలింది మహా యుద్ధమే. పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈనెల 7న జరిగే పోలింగ్ కోసం ఈసీ అన్ని జాగ్రర్తలు తీసుకుంది. ముందస్తు ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 119 నియోజక వర్గాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం తెలంగాణలో 2 కోట్ల 80 లక్షల 64 వేల 684 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు కోటి 41 లక్షల 56 వేల 182 మంది కాగా మహిళా ఓటర్లు కోటి 39 లక్షల 811, థర్డ్ జెండర్ 2691 మంది ఓటర్లు ఉన్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఎన్నికల బరిలో 1821 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో ఆత్యల్ప పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా బాన్సువాడ నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 30 వేల మంది పోలీసులు, 279 కేంద్ర కంపెనీ బలగాలు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి 18,860 మంది పోలీసుల తరలించారు. ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటారు.

0 Comments