ADS

header ads

మోదీ ఫొటోలపై ఈసీ ఆగ్రహం

NEWS HUNTER : రైల్వే, విమాన టికెట్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోలను ముద్రించడంపై ఈసీ అభ్యంతరం తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా విమాన, రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాలను తొలగించకపోవడంపై వివరణ కోరుతూ బుధవారం విడివిడిగా లేఖలు రాసింది.

రైలు టికెట్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటో ముద్రించటంపై అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల సంఘానికి గత మంగళవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ విజయాలను తెలిపే ప్రకటనలో భాగంగా రైలు టికెట్లపై ప్రధాని మోదీ చిత్రాన్ని ముద్రిస్తున్నారని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమేనని ఈసీకి రాసిన లేఖలో తృణమూల్‌ పేర్కొంది. ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న ఆ తరహా రైలు టికెట్ల ముద్రణ నిలిపివేతకు ఆదేశించాలని ఈసీని కోరింది. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈసీ రైల్వే, విమానయాన శాఖలకు లేఖలు పంపింది.