ADS

header ads

పది విద్యార్థిని బలిగొన్న ‘పబ్‌జీ’

NEWS HUNTER : పదోతరగతి పరీక్షలు రాస్తున్న కుమారుడు సెల్‌ఫోన్లో ‘పబ్‌జీ’ ఆడుతూ సమయం వృథా చేసుకుంటున్నాడని ఆ తల్లి మందలించింది. అమ్మపై అలిగిన ఆ బాలుడు ఆవేశంతో వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ మన్మోహన్‌, ఎస్సై సంజీవరెడ్డి కథనం ప్రకారం.. కాలకూరి భరత్‌రాజ్‌, ఉమాదేవి మల్కాజిగిరి విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. లాహిరి ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా, సాంబశివ(16) ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. బుధవారం ఆఖరి పరీక్ష రాయాల్సి ఉంది. సోమవారం రాత్రి తల్లి సెల్‌ఫోన్‌ తీసుకుని పబ్‌జీ గేమ్‌ ఆడుకుంటూ కనిపించాడు. చివరి పరీక్ష పూర్తయ్యేవరకు ఇలాంటి ఆటలకు దూరంగా ఉండాలని తల్లి గట్టిగా మందలించింది. ఆ మందలింపే తమకు కొడుకును దూరం చేస్తుందని ఆమె ఊహించలేదు. అమ్మ తిట్టిందని మనస్తాపానికి గురైన బాలుడు గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అరగంట తర్వాత కొడుకు ఏం చేస్తున్నాడోనని తల్లి గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, లోపల గడియ పెట్టి ఉండటంతో కిటికీలోనుంచి చూసింది. సాంబశివ అచేతనంగా కిందపడి ఉండటంతో స్థానికుల సహాయంతో గది తలుపులు విరగ్గొట్టి అతడిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతడు తువ్వాలుతో ఉరేసుకున్నాడని, బాలుడు బరువు ఎక్కువగా ఉండటంతో తువ్వాలు ఊడి కిందపడిపోయాడని భావిస్తున్నారు. ఈ మేరకు ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.