ADS

header ads

నవరత్నాలే అభివృద్ధి సూత్రాలు

NEWS HUNTER : నవరత్నాలే అభివృద్ధి సూత్రాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. బుధవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఐటిడిఎ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్టీల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆ శాఖకు నాలుగున్నరేళ్లపాటు మంత్రిని కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. తమ ప్రభుత్వం గిరిజన సమగ్రాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలు రచిస్తోంద న్నారు. ఎస్టీ రైతులకు భూమి కేటాయించడంతో పాటు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తామన్నారు. ఆర్వోఆర్‌ సమస్యలను త్వరతిగతిన పరిష్కరిస్తామన్నారు.

వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక కింద గిరిజన వధువులకు రూ. లక్ష అందిస్తామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. అమ్మ ఒడి కింద 4.2 లక్షల ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.15వేల లబ్ధి చేకూరుస్తామ న్నారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజనులే వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులుగా రాబోతున్నారని చెప్పారు.

ప్రతి ఐటిడిఎ పరిధిలో ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఐటిడిఎ అధికారులు నిబద్ధతతో పనిచేస్తే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గిరిజనుల సంక్షేమానికి నిధుల కొరత లేదన్నారు. కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు.

బాలికల వసతి గృహాలకు రక్షణ కరువైందన్నారు. ఈ సమస్యలను అధిగమించా లన్నారు. ప్రతి వసతి గృహం చుట్టూ సిసి కెమేరాలను ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు లభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్తికేయ మిశ్రా, ఐటిడిఎ పిఓలు, గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి సంచాలకులు ఇ రవీంద్ర బాబు, గురుకులాల కార్యదర్శి భాను ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.