NEWS HUNTER :అగ్రరాజ్యం అమెరికా ఆదేశాలను టర్కీ ధిక్కరించింది. రష్యా తయారు చేసే ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించిన తొలి దశ వాహనాలు టర్కీకి చేరుకున్నాయి. రాజధాని అంకారాలోని విమానాశ్రయానికి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ వాహనాలు చేరుకున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు.ఇప్పటికే టర్కీ వద్ద అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్లు ఉన్నాయి. అయితే రష్యా నుంచి ఎస్-400 కొనుగోలును అమెరికా అడ్డుకున్నది. అమెరికా, టర్కీ.. నాటో దళాల్లో సభ్యదేశాలు. కానీ రష్యాతో టర్కీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నది. అమెరికా వద్ద వంద ఎఫ్-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని టర్కీ ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే రష్యా ఎస్-400 సిస్టమ్స్ ఉన్న దగ్గర తమ ఎఫ్35 విమానాలు ఉండరాదని అమెరికా వాదిస్తున్నది.
ఎందుకంటే తమ ఫైటర్ జెట్లను రష్యా హ్యాక్ చేస్తుందని అమెరికా అభిప్రాయపడింది. అయితే ఎస్400 క్షిపణ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కూడా కొనుగోలు చేయలనుకున్నది. భారత్‌కు కూడా అమెరికా గతంలోనే వార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించడం తీవ్రమైన విషయమని, దీనిపై తాము అసంతృప్తితో ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు గతంలో చెప్పారు.ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ టర్కీ చేరుకుందన్న దానిపై ఇంకా అమెరికా స్పందించలేదు.
