ADS

header ads

కమెడియన్ పృథ్వీకి కీలక పదవి ఇచ్చిన జగన్

NEWS HUNTER : 'థర్టీ ఇయర్స్ ఇండ్రస్టీ'గా గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీరాజ్‌కు ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వంలో పదవి లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన పృథ్వీకి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా నియమించారు. పృథ్వీకి కీలక పదవి కట్టబెట్టడంతో మిగిలిన వైసీపీ మద్దతుదారులైన సినీ పరిశ్రమకు చెందిన కొందరు తమకు కూడా ఏదైనా పదవి దక్కుతుందేమోననే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్‌గా దర్శకుడు రాఘవేంద్రరావు ఉన్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన గౌరవ ప్రదంగా ఆ పదవికి రాజీనామా చేశారు. 2018లో చానల్ చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియమితులయ్యారు. దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూనే చానెల్ బాధ్యతలు కూడా నిర్వహించారు. రాఘవేంద్రరావు రాజీనామా చేసిన తర్వాత చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఇదే రంగానికి చెందిన పృథ్వీకి చైర్మన్ పదవి ఇవ్వడం గమనార్హం.
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పృథ్వీ తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఆయన వైసీపీ తరుపున ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అప్పట్లో టికెట్ లభించలేదు. పృథ్వీ ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం విదితమే.