News Hunter (Nellore) : చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన కొందరు యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. తల్లి దండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, జల్సాలకు అలవాటు పడటంతో దొంగలుగా మారుతున్నారు. నెల్లూరు నగరంలో బైకులు దొంగతనాలు చేస్తూ నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. నగరంలోని శెట్టిగుంట రోడ్డు, నవాబుపేట, నాలుగవ మైలు, కిసాన్ నగర్ లకు చెందిన చక్రాల డింపు అలియాస్ రాహుల్, వల్లూరు దిలీప్, ముచ్చి సురేష్, తుమ్మల దేవ సునీల్ అనే నలుగురు యువకులు ఇటీవల నగరంలోని నవాబుపేట, చిన్నబజార్, బాలాజీనగర్, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. వరుస చోరీలపై దృష్ఠి సారించిన నవాబుపేట సిఐ వేమారెడ్డి పోలీసులు చోరీలపై విచారణ జరిపారు. నిందితులుగా ఉన్న నలుగురు యువకులను శుక్రవారం అరెస్ట్ చేసి చోరీకి గురైన నాలుగు ద్విచక్ర వాహనాలను, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి నవాబుపేట పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ముద్దాయిల్లో చక్రాల డింపు, వల్లూరు దిలీప్ లో గతేడాది ఓ కేసులో జైలుకు వెళ్లి ఉన్నారని చెప్పారు.
