News Hunter : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వాహన చట్టం 2019.. ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసులు కొత్త.. కొత్త.. వింతైన ఫైన్లు వేయడం చర్చగా మారింది. భారీగా జరిమానాలు వడ్డించడంతో వాహనదారులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీ ఉన్నా ఏదో సాకుతో చలానాలు రాస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, అర్థంపర్థం లేకుండా జరిమానాలు విధిస్తూ వేధిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు.. తాజాగా జైపూర్‌లో ట్రాఫిక్ పోలీసులు రాసిన చలానా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. చెప్పులు వేసుకుని.. చొక్కాకు గుండీలు పెట్టుకోలేదని ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు చలానా రాసి చేతిలో పెట్టారు పోలీసులు.. దీంతో ట్యాక్సీ డ్రైవర్ నోట మాటరాని పరిస్థితి.. అయితే, జరిమానా ఎంత చెల్లించాలనేది కోర్టు చూసుకుటుందని సదరు పోలీసులు సెలవిచ్చారు. ఈ నెల 6వ తేదీన ఈ ఘటన జరిగినా కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది ఈ ఘటన. అయితే, మరో విషయం ఏంటంటే రాజస్థాన్ సర్కార్ కొత్త వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకురానిసంగతి తెలిసిందే. కాగా, కారులో ప్రయాణిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.. లుంగీతో లారీ నడిపాడని భారీ జరిమానా.. చివరకు కండోమ్ లేదని చలాన్ లాంటి వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
