News Hunter : ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో కేంద్రం వాటి ఎగుమతిపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉల్లిపాయలను ఎగుమతి చేయరాదంటూ వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులు మీదా నిషేధం విధించినట్లు తెలిపింది. ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ప్రజలకు ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఐటీసీ చాప్టర్ 2 లోని 51, 51 నిబంధనల ప్రకారం ఈ నిషేధం విధించినట్లు వెల్లడించింది. ఉల్లిని సాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పంట నష్టానికి గురికావడంతో దిగుబడి తగ్గింది. దీంతో ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో ఉల్లి ధర రూ.70-80 వరకు ఎగబాకింది. దిల్లీలోనూ ఇదే ధర ఉండటంతో దిల్లీ ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంది. కిలో ఉల్లి రూ.23.90కే ఇస్తున్నట్లు తెలిపింది. ప్రకటించిన రేటుకే ఉల్లిని సరఫరా చేసేందుకు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేసింది.
