ADS

header ads

సోషల్ మీడియాపై సుప్రీం ఆందోళన..! గైడ్‌లైన్స్‌కు ఆదేశం..

News Hunter : సోషల్ మీడియా వినియోగం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడంతా ఫేస్‌బుక్, వాట్సప్ కాలం నడుస్తోంది. ఎవరైనా ఏదైనా పోస్టు చేయవచ్చు... ఏదైనా షేర్ చేయవచ్చు... అవాస్తవాలు... తప్పుడు వార్తలకు సోషల్ మీడియా వేదికగా మారిపోతుంది. సోషల్ మీడియా పోస్టింగులు వ్యక్తులపై దాడులకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ప్రమాదకరంగా మారిందని సుప్రీం కోర్టు కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ప్రొఫైల్స్‌ను ఆధార్‌తో లింక్ చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది.
ఇక, సోషల్ మీడియా వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది.  సోషల్ మీడియా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. సోషల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణం విధివిధాలను రూపొందించాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా గైడ్‌లైన్స్‌ రూపొందించి తమముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. సోషల్ మీడియా ద్వారా వస్తున్న పోస్టులు... ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్న సమాచారం ఈ మధ్య కాలంలో దేశానికి ప్రమాదకరంగా మారిందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక అంశాలకు సంబంధించి కోర్టులు ఏమీ చేయలేవని... ప్రభుత్వమే విధివిధానాలను రూపొందించాలని సూచించింది. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీతో అన్నీ సమస్యలేనన్న జస్టిస్ గుప్తా... స్మార్ట్ ఫోన్ వదిలేసి... తాను బేసిక్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఏకే 47 వంటి ఆయుధాలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయని... ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.