News Hunter : విజయవాడలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీరోజు ప్రత్యేక అలంకారల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా నవరాత్రుల్లో భాగంగా మంగళవారం గాయత్రీ దేవీగా దుర్గమ్మ భక్తకోటికి అనుగ్రహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో మూడురోజున అమ్మవారు ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ... భక్తుల ముందుకు వచ్చారు. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీ దేవీని పూజిస్తే అన్ని కష్టాలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే గాయత్రీదేవీ రూంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి క్యూ కట్టారు. అంతేకాకుండా బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తులు విశ్వసిసస్తారు. మంగళవారం వంగ, ఆకుపచ్చ, బంగారు వన్నెల చీరల్లో కొలువుదీరిన అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తారు. మరోవైపు కొండపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అందించేందుకు పెద్దఎత్తున తీర్థప్రసాదాలు సిద్దం చేశారు.
