ADS

header ads

ఫ్లిప్‌కార్ట్‌ నుంచి అప్పు తీసుకోవచ్చు!

కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి సెల్‌ఫోన్ల వంటివి కొనుగోలు చేయడమే కాదు.. అప్పులు కూడా తీసుకునే అవకాశం త్వరలో కలగనుంది. ఆర్థిక సేవలపై దృష్టి సారించిన సంస్థ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్‌ పొందేందుకు దరఖాస్తు చేస్తోంది. తొలుత తమ వద్ద ఉత్పత్తులు కొనుగోలు చేసే వారికి, తమ ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలు జరిపే వారికి ఈ సేవలు అందించి, క్రమంగా ఇతరులకూ విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక. దీంతోపాటు బీమా పథకాలను కూడా విక్రయించనుంది. మూడు నెలల్లో ఈ సేవలు ప్రారంభించాలన్నది సంస్థ ప్రణాళిక.

లక్ష మంది విక్రయదార్లు..
10 కోట్ల మంది వినియోగదార్లు
ఆన్‌లైన్‌ విక్రయాల్లో అమెరికా దిగ్గజం అమెజాన్‌కు దీటుగా ఎదిగిన దేశీయ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌. ఇటీవలే ఈ సంస్థను అమెరికా రిటైల్‌ అగ్రశ్రేణి సంస్థ వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లక్ష మంది వ్యాపారులు విక్రయాలు జరుపుతుండగా, 10 కోట్ల మంది నమోదిత వినియోగదారులున్నారు. ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌ దరఖాస్తు చేస్తోంది. ఇది సాకారమైతే, వీరందరికీ రుణాలిచ్చే వీలు సంస్థకు కలుగుతుంది. పేటీఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ తరహాలో క్రమంగా ఇతరులకూ ఈ సేవలు విస్తరించాలన్నది సంస్థ యోచనగా చెబుతున్నారు. 3 నెలల్లో ఈ సేవలకు శ్రీకారం చుట్టొచ్చు.

బీమా సంస్థలతోనూ ఒప్పందం
సూక్ష్మ బీమా పథకాల ఆవిష్కరణ కోసం బీమా కంపెనీలతోనూ ఫ్లిప్‌కార్ట్‌ జట్టుకడుతోంది. తమ వద్ద కొనుగోలు చేసిన ఉత్పత్తులకు, బీమా సదుపాయం కల్పించేలా ఇవి ఉండొచ్చని చెబుతున్నారు. ఇందువల్ల స్మార్ట్‌ఫోన్‌ వంటివి సమగ్ర బీమాతో కొనుగోలు చేసుకోవడం వినియోగదార్లకు సాధ్యపడుతుంది. ఉత్పత్తుల సరఫరా, వాపసు సమయాల్లో దెబ్బతిన్నా, నష్టపోకుండా వ్యాపారులు కూడా బీమా పొందొచ్చు. తొలుత పోర్టల్‌ ఉత్పత్తుల బీమాకే పరిమితం అయినా, క్రమంగా సాధారణ-జీవిత బీమా పథకాలు కూడా విక్రయించాలన్నది ఫ్లిప్‌కార్ట్‌ ప్రణాళిక. కొన్ని బీమా పథకాలు మాత్రమే విక్రయించనుంది. బీమా సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు, బీమా నియంత్రణ ప్రాథికార సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతించింది కూడా.

నెలవారీ కిస్తీలపై కొనుగోలు చేసుకునేలా..
‘మా వినియోగదార్లకు అత్యంత భిన్నమైన ఆర్థిక పరిష్కారాలు కల్పించడమే ధ్యేయంగా, ఆర్థిక సేవల సాంకేతికతను వినియోగిస్తామని, ఫ్లిప్‌కార్ట్‌ ఆర్థిక సేవల విభాగాధిపతి రవి గరికపాటి వెల్లడించారు. తమ పోర్టల్‌లో కొనుగోలు చేస్తున్న వారిలో 60 శాతం మందికి, సంఘటిత ఆర్థిక సేవల నుంచి రుణం అందడం లేదని గ్రహించామన్నారు. అందువల్లే పెద్దమొత్తం కొనుగోళ్లు జరిపేందుకు వెనుకాడుతున్నారని, ఇది కంపెనీ వృద్ధిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఇందుకోసమే కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో కలిసి రుణాలిప్పిస్తూ, నెలవారీ వాయిదాల సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఈ పద్ధతిలో  ఎక్కువమందికి సేవలందించలేక పోతున్నామని గుర్తించింది.

విక్రయదార్లకు నిముషాలు/సెకన్ల వ్యవధిలో..
గతంలో విక్రయదార్లకు రుణాలు అందించే పద్ధతిని సంస్థ ప్రవేశపెట్టింది. అయితే వారికి కావాల్సిన సమయంలో అందించలేకపోతున్నామని గ్రహించి, దానిని నిలిపి వేసింది. వ్యాపారులు కోరుకున్న నిముషాలు/సెకన్ల వ్యవధిలోనే రుణం అందించేలా కొత్త పద్ధతి ఉంటుందని రవి తెలిపారు. తమ సొంత ఖాతాల నుంచే బదిలీ చేయాలన్నది ప్రతిపాదనగా వివరించారు. వినియోగదార్లకు రుణాలు ఇచ్చే వ్యాపారంలో రూ.వేల కోట్ల మేర అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వాణిజ్య రుణాల్లోనూ ఇదే స్థాయి వ్యాపారం లభిస్తుందన్నారు. ఇందుకోసమే ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే పూర్తిస్థాయి సేవలందించలేమని, కొందరు భాగస్వాములూ ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

అమెజాన్‌ కూడా..
తమ వినియోగదార్లకు రుణాలందించేందుకు అమెజాన్‌ కూడా ఆర్థిక సేవల రంగాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. అమెరికాలో భాగస్వాముల ద్వారా ఈ సేవలందిస్తోంది. భారత్‌లోనూ తమ వినియోగదార్లకు రుణాలు అందడం లేదని సంస్థ గుర్తించింది. తమ వినియోగదార్లకు రుణాలిచ్చే ఆర్థిక సంస్థ లేనపుడు, తామే ఇచ్చేందుకు ముందుకొస్తామని ఇటీవల ఒక సందర్భంలో అమెజాన్‌ ఇండియా అధిపతి అమిత్‌ అగర్వాల్‌ పేర్కొనడం గమనార్హం.


Post a Comment

0 Comments