ADS

header ads

మరో సరి బయటపడ్డ ముల్టీలెవల్ మోసం 25 కోట్లు వసూలు చేసిన నెల్లూరు వాసి ...

News Hunter : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన కుమార్‌ గిరీష్‌సింగ్‌ (34) ఇంటర్‌ చదివాడు. బాలాత్రిపుర సుందరిదేవి భక్తుడిగా ఆధ్యాత్మిక ప్రసంగాలు విని.. తర్వాత తానే ప్రవచనాలు మొదలుపెట్టాడు. తన సోదరుడు దిలీప్‌సింగ్‌తో కలిసి నగరంలోని మాదాపూర్‌లో ఉండేవాడు.తాను భారతదేశ అపర కుబేరునిగా అవతరించబోతున్నానని అమాయకులను నమ్మించి ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితుడిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అతడికి సహకరించిన సోదరుడినీ జైల్లోకి నెట్టారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో సంయుక్త కమిషనర్‌ సుధీర్‌బాబు సోమవారం విలేకర్లకు వివరాలు వెల్లడించారు.

కుమార్‌ గిరీష్‌సింగ్‌ అద్వైతక్రియ పేరిట అనేక ప్రక్రియలు సృష్టించి భక్తుల సమస్యలు తీరుస్తానంటూ పెద్దపెద్ద హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేశాడు. బిలియనీర్‌ కావాలంటే కుబేర ప్రక్రియ, జీవితంలో సంతోషం కోసం అమృత ప్రక్రియ, ఆరోగ్యం కోసం ధన్వంతరి, పెళ్లి కోసం కల్యాణ ప్రక్రియ అంటూ నమ్మబలికాడు. తన మాటలకు ఆధ్యాత్మిక రంగు అద్ది పలు టీవీ ఛానళ్లలో పెయిడ్‌ కార్యక్రమాలతో పలువురిని ఆకర్షించాడు. ఒక్కొక్కరి దగ్గర రూ.75 వేల నుంచి రూ.2 లక్షలు వసూలు చేశాడు. 2017 జులైలో అమీర్‌పేటలో డ్రీమ్‌ బ్రిడ్జ్‌ అనే సంస్థను ప్రారంభించాడు. డ్రీమ్‌ బ్రిడ్జ్‌ సోషల్‌ ట్రేడ్‌ పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండానే మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ను ప్రారంభించాడు. నెలకు రూ.23 లక్షలు అద్దెతో మాదాపూర్‌లో నాలుగంతస్తుల భవనాన్ని తీసుకున్నాడు. తాను పెట్టబోయే 30 సంస్థల్లో వెయ్యి పెట్టుబడి పెడితే త్వరలోనే రూ.లక్ష సంపాదించవచ్చని ఆశ పుట్టించాడు. ఉన్నత చదువులు చదివిన సుమారు 350 మంది ఉద్యోగులను పెట్టుకున్నాడు. వీరికీ జీతాలివ్వలేదు. ఇతడిని అనుసరించే వారిలో సామాన్యుడి నుంచి కోటీశ్వరులూ ఉన్నారు. వీరంతా పెట్టుబడి పెట్టడంతో 41 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.25 కోట్లు పోగేసుకున్నాడు. రూ.కోట్లు ఖర్చు చేసి తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. ఖరీదైన కార్లు, దేశవిదేశీ పర్యటనలతో జల్సాలు చేశాడు.

అడిగితే బెదిరింపులే
లాభాలు రాకపోవడంతో డబ్బులు కట్టినవాళ్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో గిరీష్‌ ముఖం చాటేశాడు. గట్టిగా నిలదీస్తే బౌన్సర్లను వెంటేసుకుని బెదిరించాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. నెలరోజులు పరిశోధించి నేరాలన్నీ నిగ్గు తేల్చారు. సోమవారం గిరీష్‌సింగ్‌, అతని సోదరుడు దిలీప్‌సింగ్‌లను అరెస్టు చేశారు. ఓ జాగ్వార్‌, ఒక వెర్నా, రెండు షెవర్లే క్రూయిజ్‌ కార్లు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌తో పాటు మరో రెండు బైకులు, 5 ఇండియన్‌ పాస్‌పోర్టులు, ఓ ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గిరీష్‌సింగ్‌ బాధితులు పెద్దఎత్తున సీపీ క్యాంపు కార్యాలయానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని విన్నవించారు.