ADS

header ads

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్


NEWS HUNTER : హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో చిన్నారి కిడ్నాప్‌ కలకలం రేపింది. ప్రశాంత్ నగర్‌లో నివాసముంటున్న చిరంజీవి, జ్యోతిల ఐదేళ్ల పాప అపహరణకు గురైంది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న వైష్ణవి.. స్కూల్‌ నుంచి వచ్చి ఇంటి ముందు ఆడుకుంటుండగా ఎత్తుకెళ్లారు. ఓ వ్యక్తి చిన్నారి చేయిపట్టుకుని తీసుకెళ్లినట్టు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
ఇంటిబయట ఆడుకుంటున్న వైష్ణవి కన్పించకుండా పోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా చిన్నారి కిడ్నాపైనట్టు గుర్తించారు పోలీసులు. కిడ్నాపర్‌ చిన్నారిని తీసుకుని ప్రశాంత్ నగర్ నుంచి మెయిన్ రోడ్డు వైపుగా వెళ్లినట్టుగా పోలీసులు చెబుతున్నారు. పాపను అపహరించిన కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు.
మరోవైపు కూతురు కిడ్నాప్ కు గురవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పాపను తీసుకెళ్లి ఎక్కడైనా అమ్మేసి ఉంటాడేమోనని ఆందోళన చెందుతున్నారు. పాప ఫొటో పట్టుకుని పోలీసులతో కలిసి వీధివీధినా అన్వేషిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్ మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామంటున్నారు పోలీసులు. కిడ్నాపర్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు.